మాతృ దేవో భవ
Dr. Ravinder Chiluveru
Rtd Principal, ALGAC, Warangal Former Principal Incharge, Professor & HoD, PG studies in Obstetrics & Gynecology (Ayurveda), Dr.BRKR Govt Ayurveda College, Hyderabad. Chief Consultant, SUPRAJAATA Speciality Clinic- A unit of Aayush Veda Vaidyam Alternative (AVVA).
నిరామయ
వ్యాధులు లేకుండా/రాకుండా జీవించాలి అని అందరం అనుకుంటాం. పేరులోనే అర్థం పరమార్థం ఉన్నదన్నట్లుగా “నిరామయ” పేరు పెట్టుకున్న స్వచ్ఛంద సంస్థ - వ్యాధులు లేని సమాజం కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నది. అందుకు సాధనాలుగా సహజ విద్య, సహజ వైద్యం, సహజ వ్యవసాయం మరియు సహజ వానప్రస్థం అంశాలుగా ఎన్నుకొని, గత కొద్ది కాలంగా శ్రీయుతులు పి. నరేందర్ రెడ్డి గారి సారథ్యంలో, అవగాహన మరియు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోంది. సరిగ్గా ఇవే అంశాలు - అనగా విద్య, వైద్యం, వ్యవసాయం, వానప్రస్థం విషయాలను వైద్య కోణంలో మొదలు పెట్టిన నా ప్రయత్నం, ‘నిరామయ’తో సాంగత్యం ఏర్పడడం కాకతాళీయమే అయినా, బంగారానికి తావి అబ్బినట్లున్నది. స్వయంగా నేను యోగా మరియు ప్రకృతి వైద్య కుటుంబంలో పుట్టి పెరగడం, ఇటీవల ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రధాన ఆచార్యులుగా పదవీ విరమణ పొందడం, చదువురీత్యా ప్రసూతి మరియు స్త్రీవ్యాధుల స్నాతకోత్తర విద్యను అభ్యసించి ఉండడం, ఇవన్నీ కలబోతగా మనం నిర్వహించుకునే "మాతృ దేవో భవ " - mothers for better society - అనే ఈ కార్యక్రమానికి పునాదులు పడినాయని చెప్ప వచ్చు. స్త్రీ జీవన గమనంలో ఎదురయ్యే అన్ని రకాల రుగ్మతలకు భారతీయ సాంప్రదాయిక వైద్య పద్ధతులు అయినటువంటి ఆయుర్వేద, యోగా మరియు ప్రకృతి వైద్యాలతో పాటు గృహ వైద్యం గురించి, అత్యవసర పరిస్థితుల్లో ఆధునిక పరీక్షలతో కూడిన అల్లోపతి వైద్యం మొదలగు విషయాలతో స్త్రీలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడం కోసం ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. ఒక ఇంట్లోని అమ్మ ఇంటి పెద్దగా ఆరోగ్య విషయాల పట్ల అవగాహన ఏర్పరచుకుంటే, ఇంటిల్లిపాదీ (అందరూ) ఆరోగ్యంగా ఉంటారు. పూర్వ రోజుల్లో అమ్మే మనకు తొలి వైద్యురాలు. వంటింటి దినుసులు, పోపుల పెట్టె, పెరట్లో మొక్కలే ప్రాథమిక వైద్యంగా, ఆహారమే ఔషధంగా, వంటిల్లే ఔషధశాలగా పరిఢవిల్లిన సంస్కృతి మనది. దానిని మరోసారి శిక్షణ ద్వారా గుర్తు చేయడంతో పాటు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధృవీకరణ/ గుర్తింపు పత్రాన్ని కూడా అందజేయడం మన ఈ కార్యక్రమ లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాము.
- Dr. Ravinder Chiluveru